బంధువులే రాబందులు అయితే?
2001 జూలై 31 ఉదయం పది గంటలవుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం ప్రక్కనే ఉన్న సజ్జలదిన్నె గ్రామంలో రెడ్డి అండ్ రెడ్డి స్టోన్ కంపెనీ ఉంది. అందులో పనివారు తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. బండలను సైజులుగా కట్ చేసి పాలిష్ పడుతున్నారు.
కార్మికులు ఎవరి పనుల్లో వారు ఉన్న సమయంలో షెడ్డులోకి వచ్చిన ఆ సంస్థ యజమానిని చూసి పని చేస్తున్నవారు మిషన్ ఒక్క క్షణం ఆపారు. అప్పటి వరకు మిషన్ పని చేస్తున్న శబ్దం ఆగిపోయి నిశ్శబ్దం ఆవరించింది. ఆయన పని చేస్తున్న వారందరినీ పలకరించాడు. యజమాని అంటే అందరికీ గౌరవం. వారి మంచి చెడ్డలన్నీ యజమానికి చెప్పుకుంటారు. ఆయన వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంటారు. అందుకే ఆయన పట్ల వారికి అమితమైన కృతజ్ఞతాభావం. షెడ్డు అంతా ఒకసారి కలయ చూశారు. తాను పనిమీద బయటకు వెడుతున్నాని జాగ్రత్తగా పని చేసుకోండని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చాడు. డ్రైవర్ న్ను పిలిచి రడీగా ఉండమని చెప్పాడు.
షెడ్డుకు కొద్ది దూరంలోనే ఆయన కార్యాలయం ఉంది. ఎవరు వచ్చినా అక్కడికే వచ్చేవారు. ఆయన ఉదయం ఊరు నుంచి వచ్చి సాయంత్రం వరకూ అక్కడే ఉండేవారు. భోజనం వేళకు మాత్రం కనీసం నలుగు రైదుగురు వచ్చేవారు. అందరికీ కావలసినవి తెప్పించి వారితో పాటు భోజనం చేయడం ఆయన అలవాటు. మధ్యాహ్నం అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అందుకు తగినట్టుగా కార్యాలయం లోపలే ఏర్పాట్లు చేసుకున్నారు.
ఆరోజు కూడా అప్పటిదాకా ఆయన స్నేహితుడు రంగారెడ్డి మరో ఇద్దరు భోజనం చేసి వెళ్లారు. ఆ తరువాత ఆయన చిన్ననాటి స్నేహితుడు, క్లాస్మేట్ ఆదినారాయణగారి అమ్మాయి వివాహం మరుసటి రోజు అనంతపురంలో ఉంది. ఆ అమ్మాయికి కానుకలు కొనడానికి సుమోలో తాడిపత్రి బయలుదేరాడు.. తనకు కావలసినవి కొన్న తరువాత చింతల వెంకట రమణ స్వామి ఆలయం దగ్గరకు వచ్చాడు. ఈ దేవాలయం ఎదురుగా బుడన్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ స్నేహితులు, అనుయాయులు అందరూ ఉంటారు. తాడిపత్రి వస్తే ఇక్కడకు తప్పకుండా రావలసిందే.
సుమో అక్కడికి వచ్చి ఆగింది. ఆయన దిగి లోపలకు వెళ్లాడు. తనకు కావలిసినవారు ఉన్నారు. కుశల ప్రశ్నల తర్వాత ‘తాను రెండు రోజుల పాటు ఊళ్లోఉండనని చెప్పాడు. అనంతపురంలో జరిగే ఆదినారాయణగారి అమ్మాయి వివాహానికి హాజరవుతున్నానని, అలాగే హైదరాబాద్‌లో జె.సి ప్రభాకరరెడ్డి కూతురు వివాహంకూడా ఉందని ఈ రెండింటికి తప్పకుండా వెళ్లాలి’ అని చెప్పాడు.
వారు ‘సరే అన్నా వెళ్లిరా’ అన్నారు.
‘అన్నట్టు మొన్న జరిగిన ఎంపి.టి.సి ఎన్నికల్లో మన ప్రత్యర్థులు ఓడిపోయారు. వారు మన పట్ల కోపంగా ఉన్నారని తెలిసింది. వారు నాకు బంధవులే అయినప్పటికీ… నాతో పాటు ఉన్న మీకు ఏమైనా అపకారం చేస్తారేమోననని అనుమానంగా ఉంది. కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉండండి’ అని చెప్పాడు.
వారంతా ‘అలాగేనన్నా’ అన్నారు.
ఈలోగా టీలు వచ్చాయి. తాగిన తర్వాత ‘ ఇక వెడతా’ అన్నాడు.
అందరూ సుమో దాకా వచ్చారు.
అందరికీ వీడ్కోలు చెప్పాడు.
తాడిపత్రి నుంచి కావేరి సముద్రం బయలుదేరాడు.
వచ్చేటప్పుడు తన కంపెనీ గుర్తుకొచ్చింది. సజ్జలదిన్నె వైపు వెళ్లమని డ్రైవర్‌కు చెప్పాడు.
సుమో అటు వైపు మళ్లింది.
రెడ్డి అండ్ రెడ్డి కంపెనీలోకి సుమో వచ్చిన తర్వాత ‘ఇప్పుడే వస్తా ఉండు వెళదాం’ అని చెప్పాడు.
డ్రైవర్ ‘సరే సార్ ‘ అన్నాడు.
ఆయన పని చేస్తున్న కార్మికుల దగ్గరకు వచ్చాడు. యజమానిని చూసి వారంతా వినయం ప్రదర్శించారు. తాను పెళ్లిళ్ల కోసం ఊరు వెడుతున్నానని, రెండు మూడు రోజులపాటు రానని పనులు జాగ్రత్తగా చేసుకొమ్మని చెప్పాడు.
అందరూ అలాగేనన్నారు.
సుమో తన కార్యలయం ప్రక్కనే ఆగి ఉంది.
టైమ్ చూసుకున్నాడు. ఐదు ఇరవై ఐదు నిమిషాలు అవుతోంది.
ఆయన వచ్చి సుమో ఎక్కి ‘కావేరి సముద్రం పోనియ్’ అన్నాడు.
‘వాటర్ ఫ్లాస్క్ ఆఫీసులో ఉంది తీసుకొని వస్తా సార్’ అన్నాడు.
‘సరే వెళ్లు’ అన్నాడాయన.
డ్రైవర్ సుమో నుంచి దిగి ఆఫీసు గదిలోకి వెళ్లాడు.
అప్పుడు ఆయనతో మాట్లాడటానికి ఒకతను వచ్చాడు.
అదే సమయంలో కంపెనీ గేటులోనుంచి ఒక యువకుడు కర్మాగారంలోపలకు వస్తున్నాడు.
‘అన్నా వాళ్లు వస్తున్నారు’ అన్నాడు.
ఆయన చూశాడు ‘మన బంధువేగా. నాతో ఏమైనా మాట్లాడటానికి వస్తున్నారేమో’ అన్నాడు.
ఆ యువకుని వెనుక మరో నలుగురు ఉన్నారు. ఇద్దరి దగ్గర బ్యాగులు ఉన్నాయి. మరో ఇద్దరు కుడి చేతులు వెనకకు పెట్టుకొని వస్తున్నారు.
అపుడు సమయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలవుతోంది.
వారు సుమోకు దగ్గరగా వస్తున్నారు.
నుమోలో కూర్చొని వారి వైపు చూస్తూ నవ్వుతూ ఆహ్వానిస్తున్నాడు.
వారు మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నారు.
కానీ ఇదేం ఆయన పట్టించుకోలేదు.
ఆయన వచ్చినతనితో మాట్లాడుతూనే ఆ వచ్చేవారి వైపు చూస్తున్నాడు.
వారు మరికొంత ముందుకు వచ్చారు.
వారిలో ఇద్దరు సంచుల్లో చేతులు పెడుతున్నారు.
డ్రైవర్ ప్లాస్క్ తీసుకొని గదికి తాళం వేస్తున్నాడు.
అప్పుడు సమయం ఐదున్నర అవుతోంది.
చెట్టుమీద ఉన్న కాకులు కావు కావుమని అరుస్తున్నాయి.
దూరంగా షెడ్డులో మిషన్ల శబ్దం వినిపిస్తోంది.
వచ్చిన వాళ్లు నాటు బాంబులు తీసి, ఒకడు సుమో మీదకు వేశాడు. మరొకడు దాని ప్రక్కనే వేశాడు.
అంతే పెద్ద శబ్దమైంది. చెవులు చిల్లులు పడిపోయేంత మోత…… ఆ వెంటనే మరొకటి… డ్రైవర్ పారిపోయాడు.
సశేషం…