కన్నీటి సముద్రం అయిన కావేరి సముద్రం…
దట్టమైన పొగ. కళ్లు మండుతున్నాయి. ఏమీ కనిపించడం లేదు. అంతవరకు ఆయన ప్రక్కన మాట్లాడుతున్న అతను కూడా పారిపోయాడు. అంతవరకు షెడ్లో లారీ నుంచి రాళ్లు దించుతున్న కూలీలు కూడా బాంబులు పడగానే పిక్క బలం చూపారు. సుమోలో కూర్చున్న ఆయన మనస్సు మొద్దుబారిపోయింది. అలాగే అచేతనంగా ఉండిపోయారు.
అక్కడికి సమీపంలోనే నివాసముండే దస్తగిరమ్మ ఇంటికి వచ్చి వసారాలో టీ తాగుతూ నిలబడింది. బాంబులు పడటంతోనే టీ గ్లాస్ వడిలేసి పెద్దగా కేక వేసి లోపలకు పరిగెట్టింది. తలుపు గడియపెట్టుకుంది. భయం భయంగా ఓ మూల ఒదిగిపోయి కూర్చుంది.
సుమోలోనే ఉన్న ఆయనకు ఏం జరుగుతుందో తెలిసే లోపలే. మరో బాంబు పేలింది. అలాగే కూర్చుండిపోయారు. దిగాలి, తప్పించుకొని వెళ్లాలి అన్న ఆలోచన కూడా ఆయనకు రాలేదు. ఎందుకంటే ఇలాంటి ఘటన ఆయన ఊహించలేదు. చుట్టూ దట్టమైన పొగ…. దుమ్ము…. కళ్లు మండుతున్నాయి.
ఏమీ కనిపించడం లేదు. ఆయన కాళ్లూ చేతులు ఆడటం లేదు.
నోటినుంచి మాట కూడా రావడం లేదు.
ఆ పొగలోంచి నలుగురు వ్యక్తులు వచ్చి ఆయన్ని చుట్టుముట్టారు. వాళ్ల చేతుల్లో వేట కొడవళ్లు ఉన్నాయి. కళ్లల్లో దుమ్ము పడి ఎర్రగా కనిపిస్తున్నాయి. ఏం జరగబోతుందో ఆయనకి అర్ధమైంది. వాళ్ల వైపు చూశాడు. అయితే ఆ వచ్చిన వాళ్లు తనకు బాగా తెలుసు. బంధుత్వం కూడా ఉంది.
అందుకే తనని ఏమీ చెయ్యరనే ధీమా అప్పటి వరకు ఉంది. వాళ్ల కళ్లలో కనిపిస్తున్న క్రూరత్వం చూసిన తర్వాత ఆయనకు అర్ధమైంది. తనను చంపటానికే వచ్చారని. అయితే ఆయనకు తప్పించుకొనే మార్గం కూడా లేదు. నలుగురూ నాలుగు వైపులా ఉన్నారు.
అప్పటి వరకు వెనుక దాచుకున్న వేట కొడవళ్లు కనిపిస్తున్నాయి. తప్పించుకొనే మార్గం లేదు. ఆయన నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు.
తనకు మృత్యు రూపంలో వారు వచ్చారని తెలిసింది..
ఆయన ముఖంపై చమట పట్టేసింది.
కాళ్లు మొద్దుబారి పోయాయి.
నోరు ఎండిపోతోంది.
ఆయన ఏదో అనబోయాడు. మాట రాలేదు. ఒకడు ఆయన్ని బయటకు లాగాడు.
మరొకడు కొడవలితో కింది పెదవి గడ్డం మధ్యలో ఓ వేటు వేశాడు.
మరొకడు వెనుక తలపై మరో వేటు వేశాడు.
ఆయన ‘అమ్మా’ అంటూ కింద పడిపోయాడు. పొట్టపై మరో వేటు………
గుండెలను చీల్చుతూ మరో వేటు.
ఆ తరువాత ఇంకొక వేటు. గుండె బయటకు వచ్చేసింది.
రక్తం ఫౌంటెన్ లా చిమ్మింది.
వాళ్ల బట్టలు రక్తంతో తడిసిపోయాయి.
ఆయన ఆర్తనాదాలు గాలితో కల్సిపోయాయి.
అప్పటికే కంపెనీలో ఉన్నవాళ్లు ప్రాణ భయంతో పారిపోయారు.
దస్తగిరమ్మ భయం భయంగా తలుపు సందులో నుంచి చూడసాగింది.
కాస్సేపటికి ఆయన కళ్లు తేలిపోతున్నాయి. శరీరం నుంచి రక్తం స్రవిస్తోంది.
నోట్లో నుంచి మాట రావడం లేదు. గుండె కొట్టుకోవడం క్రమంగా ఆగిపోతోంది.
గాలి కాసేపు స్థంభించింది.
చెట్టుపైన ఉన్న పక్షులు భయంతో ఆకాశంలోకి ఎగిరి పోయాయి.
చెట్టు ఆకులు కదలడం ఆగిపోయాయి.
సూర్యుడు ఈ దృశ్యం చూడలేనంటూ ఎర్రముద్దగా మారి పడమటి కనుమల్లోకి వెళ్లిపోయాడు.
తాము వచ్చిన పని పూర్తయ్యిందని అనుకున్నారు. ఆయన చనిపోయాడని వారు నిర్ధారణ చేసుకున్నారు.
అలా రక్తపు బట్టలతో నడుచుకుంటూ వెళ్లిపోయారు.
వారు వెళ్లిపోయిన తర్వాత దస్తగిరమ్మ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది.
పడిపోయి రక్తంతో తడిసిపోయి ఉన్న యజమానిని చూసి ఆమె గుండె తరుక్కుపోయింది.
తమని ప్రేమగా చూసే యజమాని అలా పడి ఉండటం చూసి ఆమెలో కన్నీళ్లు ఉబికి వచ్చాయి. అలా ఏడుస్తూనే దగ్గరగా వచ్చింది.
ఆయన కళ్లు అలా చూస్తూనే ఉన్నాయి. ఆయన నాలుక బయట పెట్టాడు.
ఇంట్లోకి వెళ్లి నీళ్లు తీసుక వచ్చి తాగించింది.
ఆ నీళ్లు గొంతు దిగలేదు.
అప్పటికే ఆయన గుండె ఆగిపోయింది.
ఆ దృశ్యం ఆమెను భయభ్రాంతులకు గురి చేసింది.
దస్తగిరమ్మ పెద్దగా కేకపెట్టింది.
దు:ఖం కట్టలు తెంచుకుంది.
రక్తసిక్తమైన రాయలసీమ రాజకీయ ఫ్యాక్షన్కు ఓ నాయకుడు బలైపోయాడు.
ప్రేమతో పలకరించడం తప్ప కక్ష్యలూ కారణ్యాలు తెలియని నిజమైన నాయకుడు. సీమలో పుట్టినా, రాజకీయాలలో ఉన్నా ఎన్నడూ ఆయుధం పట్టి ఎవరినీ చంపలేదు.
పగవాడిని కూడా ఆప్యాయంగా పలకరించే తత్త్వం ఆయనది. ఆఖరికి చీమలను కూడా మానవతా దృక్పధంతో చూసే మనిషి.
తన ఊరే కాదు పొరుగు ఊరు వాడైనా సహాయం కోసం వస్తే ఆదరించి, అభిమానించి, అన్ని రకాలా ఆదుకొనే గొప్ప మనిషి.
తెలిసి ఎవరికీ అన్యాయం చెయ్యలేదు. కలలో కూడా ఎవరికీ ముప్పు తలపెట్టలేదు.
అయినా అయిన వాళ్లే తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఓ మంచి మనిషిని మట్టు పెట్టారు.
జనం దృష్టిలో ఆయనే నాయకుడు. మరో వ్యక్తిని విశ్వసించేవారు కాదు.
నిస్వార్ధమైన సేవకు, నికార్సయిన అభిమానానికి ఆయన ప్రతీక.
ఈ గుణాలే ఆయన వ్యతిరేక వర్గం గుండెల్లో నిప్పులు రాజేశాయి.
గునపాలు గుచ్చాయి. ఆయన బ్రతికి ఉన్నంత కాలం తమకు మనుగడ లేదనుకున్నారు.
ఆయన ఉంటే ఏ ఎన్నికలలో కూడా తాము గెలవలేమని తీర్మానించుకున్నారు. అందుకే ప్లాన్ చేసి పకడ్బందీగా అమలు చేశారు.
బంధువులే రాబందులయ్యారు.
తన ఫ్యాక్టరీ ఆవరణలోనే నిర్జీవంగా పడి ఉన్నారు.
ఆయనే మిద్దె చిన్న పుల్లారెడ్డి. అందరూ ఎం.సి పుల్లారెడ్డి అని ఆప్యాయంగా పిలుస్తారు
ఆయన పుట్టి పెరిగిన ఊరు కావేరి సముద్రమే కాదు ఆ చుట్టు ప్రక్కల గ్రామాలకు ఈ వార్త వెంటనే చేరిపోయింది.
ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు.
కావేరి సముద్రమైతే కన్నీటి సముద్రమే అయ్యింది.
అనంతపురం జిల్లా ఓ గొప్ప రాజకీయ నాయకుణ్ణి కోల్పోయింది.
పుల్లారెడ్డి మనసున్న మారాజు, మంచితనమే శ్వాసగా బతికిన మనిషి.
నడిచే దైవం. ప్రజలతో మమేకమై పోయిన మహోన్నతుడు.
అలా నెత్తుటి మడుగులో నిర్జీవంగా పడిపోయాడు.
తన చేతులతో కట్టిన కర్మాగారం ఆవరణలో, రోజూ తను తిరిగే ఆ మట్టిలో నెత్తుటి ముద్దగా మిగిలిపోయాడు.
మంచి తనాన్ని, మనిషి తనాన్ని మాత్రం మనకు వదిలిపెట్టి తిరిగిరాని లోకానికి శాశ్వతంగా వెళ్లిపోయాడు.
మిద్దె చిన్న పుల్లారెడ్డి అనే నాయకుడు కావేరి సముద్రానికి ఇప్పుడు చెదిరిన ఓ మధుర స్వప్నం.
అనంతపురం వాసులు ఎప్పటికీ మరిచిపోలేని వ్యధ.
ఓ కారుణ్యమూర్తి కథ.
సశేషం…